మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమన్నారు. పీజీటి టీచర్ గా జీవితాన్ని మొదలు పెట్టి, స్వర్గం, నరకం సినిమా ద్వారా విలన్ గా సిని రంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారని ప్రశంసించారు. సినిమా రంగంలో బిజీగా ఉన్న కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగు పెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని కొనియాడారు.
READ MORE: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
కేవలం నటుడు గానే కాకుండా అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమని భట్టి విక్రమార్క అన్నారు. “కేవలం వ్యాపారమే కాకుండా 25శాతం ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం. సిని రంగమైనా, విద్యా రంగమైనా సామాజిక బాధ్యతగా ముందుకు వెళుతున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేథస్సు అందరికి ఉపయోగపడాలి. స్థాయి, హోదా పది మందికి ఉపయోగపడేవిధంగా జీవితాన్ని మలుచుకోవాలి.మనం బ్రతుకుతూ పది మందిని బ్రతికించడం గొప్ప విషయం. పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్బుత విజయాలు సాధించాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో విశాలమైన, మానస సరోవరం లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మరిచిపోకూడదు.” అని వ్యాఖ్యానించారు.