NTV Telugu Site icon

Bhatti Vikramarka : అనేక అంశాలపై లోతుగా చర్చించాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంతోనే పరిష్కారాలన్నీ దొరుకుతాయని భావించడంలేదన్నారు భట్టి విక్రమార్క. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు భట్టి. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నతస్థాయి అధికారుల కమిటీతో కూడా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మంత్రులతో మరో కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయింయించినట్లు తెలిపారు.

అంతేకాకుండా.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ చేయాలని నిర్ణయించామని.. సైబర్ నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇక ఇటీవలె ఏపీలో కూడా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం గమనార్హం.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమగ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారని.. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక మంత్రులతో కూడిన మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామని.. భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.