Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.
బెజవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది. తమ సంస్ధలో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఉందన్నది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ మెసేజ్‌కు యువతి స్పందించింది. దీంతో రెండు యూ ట్యూబ్ లింక్‌లను ఆమెకు పంపారు. ఆ వీడియోలకు లైక్ కొడితే.. 150 రుపాయలు చెల్లిస్తామన్నారు. అయితే, ముందుగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. షరతు పెట్టారు. దీంతో ఆమె వెయ్యి రూపాయలు చెల్లించింది. తర్వాత యూ ట్యూబ్ లింకులకు లైకులు కొట్టింది. దీంతో ఆమె ఖాతాలో 13 వందల రుపాయలు డిపాజిట్ అయ్యాయి. తర్వాత ఆమెతో 5 వేల రుపాయలు పెట్టుబడి పెట్టించారు. ఈ సారి 7 వేల రుపాయలు వేశారు. ఇలా.. సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో చిక్కుకున్న యువతి. వాళ్లు చెప్పినంత డబ్బు డిపాజిట్ చేస్తూ వచ్చింది. దఫాదఫాలుగా సుమారు 20 లక్షల రుపాయలు ఆమె డిపాజిట్ చేసింది. కానీ.. అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. విజయవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
పోరంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వర్క్ ఫ్రం హోం… పార్టు టైం ఉద్యోగం పేరుతో సుమారు నాలుగు లక్షల రుపాయలు కాజేశారు. అలాగే, విజయవాడకు చెందిన ఓ యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేసింది ముఠా. సైబర్ నేరగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. మాటల్లో పెట్టి మోసాలకు పాల్పడతారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లను నమ్మోద్దంటున్నారు. ముఖ్యంగా వాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. లేదంటే బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తారని హెచ్చరిస్తున్నారు.