Bengaluru Cops seize explosives: బెంగళూరులో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఆపి ఉంచిన ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్‌లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో సహా ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారి ఒకరి తెలిపారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇటీవలి రోజుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు ఉన్న ట్రాక్టర్ దొరికింది.ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాటల హోరే!
బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ కేసులో ఓ అనుమానితుడిని గత వారం ఎన్‌ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది.