ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఆమె మాట్లాడుతూ.. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు.
పురందేశ్వరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. కాబట్టి యర్నగూడెం వచ్చారన్నారు. నా స్వగ్రామమైన యర్నగూడెంలో లేనిపోని అసత్యాలను ఆమె మాట్లాడడం బాధాకరమన్నారు. కొవ్వూరులో ఇసుక రవాణాలో ఒక్క రూపాయి నాకు చేరిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. పక్క జిల్లాల్లో నాకు ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని… దయచేసి ఆ పత్రాలు నాకు అందజేయండని తెలిపారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు పురందేశ్వరి.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నన్ను ఎదుర్కోలేక నాపై బురద జల్లాలని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.