Pakistan: పాకిస్థాన్ అధికారం ఇస్లామాబాద్, రావల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే ఈ నగరాన్ని పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించారు. ఇది మేం చెప్పడం లేదు, కరాచీ నగరంలోని సీనియర్ పోలీసు అధికారుల ప్రకటనలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ (AIG) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మంగళవారం ఈద్ సందర్భంగా రంజాన్ నెలలో 3 నుండి 4 లక్షల మంది యాచకులు నగరానికి చేరుకున్నారని పేర్కొన్నారు. కరాచీ యాచకులు, నేరస్థులకు అత్యంత ప్రాధాన్య నగరంగా మారుతోందని ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.
Read Also: karnataka High Court: 498ఏ దుర్వినియోగం అవుతోంది.. వరకట్న వేధింపుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
ఇంటీరియర్ సింధ్, బలూచిస్తాన్, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నేరస్థులు ఈద్ సీజన్‌లో కరాచీకి వచ్చినట్లు అదనపు ఐజీ తెలిపారు. సంప్రదాయ చర్యల ద్వారా నేరాలను గుర్తించలేమని ఆయన అన్నారు. కరాచీలో నేరగాళ్లపై నిఘా ఉంచేందుకు మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఒక్క రంజాన్ మాసంలోనే రోడ్డు నేరాల ఘటనల్లో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారని జియో న్యూస్ నివేదించింది. అదే సమయంలో, జనవరి 2024 నుండి 55 మందికి పైగా డకాయిట్ల చేతిలో మరణించారు.
పోలీసులకు హైకోర్టు అల్టిమేటం
కొద్ది రోజుల క్రితం, కరాచీలో పెరుగుతున్న నేరాల మధ్య శాంతిభద్రతలను పునరుద్ధరించాలని సింధ్ హైకోర్టు రాష్ట్ర అధికారులకు ఒక నెల అల్టిమేటం ఇచ్చింది. శాంతిభద్రతలను మరింత దిగజార్చడంలో ప్రమేయం ఉన్న “ప్రభావవంతమైన వ్యక్తుల”పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. శాంతిభద్రతలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు.