NTV Telugu Site icon

TSSPDCL CMD: వర్షాకాలంలో విద్యుత్‌తో జాగ్రత్త.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

Electricity

Electricity

Be Vigilant about Electricity Says TSSPDCL CMD: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా/ సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలో జరిగే మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ, తగు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూపరిండెంట్ ఇంజినీర్లకు, చీఫ్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

Also Read: Harish Rao : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వైద్య శాఖను అప్రమత్తం చేసిన మంత్రి

వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు క్రింద సూచించిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు.

1. వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు విద్యుత్ వైర్లకు, స్టే వైర్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉంచాలి.

2. ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కానీ విద్యుత్ తీగ పడి వున్న యెడల ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుంచి వాహనాలు నడపడం చేయరాదు. ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకురాగలరు.

3. విద్యుత్ స్తంభాలను, స్టే వైర్లను తాకరాదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి విద్యుత్ ప్రవాహకాలైన లోహపు రాడ్లను ఉపయోగించకుండా చెక్క/ ప్లాస్టిక్‌తో చేసిన పైపులను మాత్రమే వాడాలి.

4. చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగిపడ్డ తీగలు ఉన్నట్లయితే వాటి పట్ల అప్రమత్తంగా వుండాలి.

5. భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్‌కి తెలియజేయగలరు.

6. విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన USC నెంబర్‌ను సిద్ధంగా వుంచుకోగలరు.

7. లోతట్టు ప్రాంతాలు, ముంపుకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.

Also Read: Noida: దారుణం.. రోడ్డుపై ఓ యువకుడిని కొట్టి కారు బానెట్‌పై కిలోమీటరు లాక్కెళ్లాడు

విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382071574, 7382072106, 7382072104 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు. దీనికి తోడు సంస్థ మొబైల్ యాప్, వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురాగలరని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలిపారు.

Show comments