India Squad for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి టోర్నీ జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు మే 1 లోపు టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. టీమ్స్ ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు త్వరలోనే జట్లను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు ఎంపికకు బీసీసీఐ కూడా ముహూర్తం ఖరారు చేసిందని తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏప్రిల్ 28న ముంబైలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుందట. ఈ సమావేశంలో ఓపెనర్, వికెట్ కీపర్, పేస్ బౌలర్లపై ప్రత్యేక చర్చ జరగనుందట. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని దించాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తుందట. ఐపీఎల్ 2024లో గిల్, యశస్వి రాణించడకపోవడమే ఇందుకు కారణం.
Also Read: DC vs SRH: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఫ్రేజర్-మెక్‌గర్క్.. ఏకంగా మూడు రికార్డ్స్!
వికెట్ కీపర్ రేసులో ముందు వరుసలో ఉన్న జితేష్ శర్మ ఐపీఎల్ 2024లో రాణించకపోవడం బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. జితేష్ స్ధానంలో దినేష్ కార్తీక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ పేర్లను పరిశీలిస్తున్నారట. డీకే, సంజూలకే జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, వైభవ్ అరోరాలు రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ ఎంపిక కానున్నారు. సూర్య, జడేజా, రాహుల్, శివమ్, హార్దిక్ జట్టులో ఉండనున్నారు.