NTV Telugu Site icon

BCCI Awards 2024: హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?

Bcci

Bcci

BCCI Annual Awards 2024 in Hyderabad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్న నేపథ్యంలో వారిని కూడా బీసీసీఐ ఆహ్వానించనుంది.

చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ 2020 జనవరిలో జరిగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక నిలిచిపోయింది. 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులను 2020లో బీసీసీఐ అందజేసింది. జస్ప్రీత్ బుమ్రా, పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోగా.. కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికవుతారన్న విషయం తెలిసిందే.

Also Read: Namrata Shirodkar: మహేశ్‌.. అభిమానులకు మీరొక ఎమోషన్‌! నమ్రత పోస్ట్‌ వైరల్

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కంటే ముందు భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. మొహాలి వేదికగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే.