BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్

  • లైంగిక వేధింపుల నిరోధానికి కొత్త ఇంటర్నల్ కమిటీ
  • ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో కొత్త నియామకాలు
  • 2028 శతాబ్ది వేడుకలకు ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్
  • అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు వేతన పెంపు
Bcci

Bcci

భారత క్రికెట్ నియంత్రణ మండలి 95వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ముగిసింది. బోర్డు పాలన, ఆర్థిక వ్యవహారాలు, మ్యాచ్ అధికారుల సంక్షేమం , రాబోయే ప్రతిష్టాత్మక టోర్నీల నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది.

లైంగిక వేధింపుల నిరోధానికి కొత్త ఇంటర్నల్ కమిటీ

క్రీడాకారులు , సిబ్బంది రక్షణకు సంబంధించిన అంశాలపై బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు లైంగిక వేధింపుల నిరోధక విధానం కింద నూతన ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయడానికి ఏజీఎమ్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు క్రికెటర్ల వయో నిర్ధారణ విధానంలో పారదర్శకత పెంచేలా పలు కీలక మార్పులను ఆమోదించింది.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నియామకాలు.. 2027 లీగ్‌పై ప్రత్యేక దృష్టి

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి అరుణ్ సింగ్ ధుమాల్, ఎం. ఖైరుల్ జమాల్ మజుందార్‌లను ప్రతినిధులుగా నియమిస్తూ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్ గ్రాండ్ మైలురాయిని పురస్కరించుకుని ఈ టోర్నీని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్డు నిర్ణయించింది. బిసిసిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2027 డిసెంబర్ నుండి 2028 వరకు సంవత్సరం పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు వేతన పెంపు

ఫీల్డ్‌లో మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించే అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు బిసిసిఐ తీపి కబురు అందించింది. వారి చెల్లింపులు పెంచడంతో పాటు అంపైర్లు, రిఫరీల గ్రేడింగ్ వ్యవస్థ పునర్వర్గీకరణకు సర్వసభ్య సభ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటెడ్ అకౌంట్లతో పాటు, 2026-27 వార్షిక బడ్జెట్‌ను , తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్ల నియామకాన్ని బోర్డు ఆమోదించింది. దీంతో పాటు దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి, వారికి అవసరమైన వనరులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర క్రికెట్ సంఘాలతో కలిసి సమగ్ర చర్యలు చేపడతామని వెల్లడించింది.