Bathukamma Festival: రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగ సందడి మొదలు కానుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని.. అసలు బతుకమ్మ కథ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. మన పూర్వికలు బతుకమ్మ కథను తిరొక్కతీర్ల చెప్పిండ్రు.. అయితే అసలైన బతుకమ్మ కథ ఎక్కడికెళ్లి ప్రారంభం అయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: H-1B Visa: ట్రంప్ H-1B రూల్స్‌పై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..
రాష్ట్రకూటుల ఏలుబడిలో తెలంగాణ..
చరిత్రలో మన తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే వారిని చెప్పబడింది. వీళ్ల దగ్గర వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. ఆ సమయంలో చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగింది. అప్పుడు వేములవాడ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచి పోరాడారు. అనంతర కాలంలో అంటే.. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటుల చివరి రాజు అయిన కర్కుడిని ఖతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజు అయ్యారు. అప్పుడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరస్వామి ఆలయం ఉండేది. ఆపదల్లో ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే చల్లగా చూస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది.
చోళరాజు కూడా స్వామి భక్తుడే..
ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి తనకు ఆపద తలెత్తినప్పుడు స్వామివారికి భక్తుడిగా మారిపోయాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామివారే తనను కాపాడారని విశ్వసించి.. అనంతర కాలంలో ఆయన తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు కానుకగా ఇచ్చిన శివలింగం కోసం ఆయన క్రీస్తు శకం 1006లో బృహదేశ్వరాలయాన్ని నిర్మాణాన్ని ఆ భారీ శివలింగాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు.
దు:ఖానికి ప్రతీకగా బతుకమ్మ..
వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతిదేవి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు తీవ్ర వేదనకు గురైంది. తెలంగాణ ప్రజలు బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారని చరిత్ర చెబుతుంది. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే అని. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతున్నారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ వాసుల చరిత్రలో భాగం అయ్యింది.
బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ..
‘బతుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో భాద్రపదమాస అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఎక్కడెక్కో పూసిన పూలు ఓ దగ్గరకు చేరనున్నాయి.. రంగు రంగుల్లో మురిసినున్నాయి. బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధానికి చిరునామాగా నిలుస్తుంది. ఈ పండుగను తెలంగాణ ప్రాంతం జనాలు సంబరంగా జరుపుకుంటారు.
READ ALSO: Sunday Special: ఆదివారం స్పెషల్‌గా ఏం చేస్తున్నారు.. ఈసారి సరదాగా వీటిని ట్రై చేయండి