Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!

Basit Ali

Basit Ali

Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్‌కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని గుర్తు చేసుకున్నారు. కేవలం నటన వల్లే కాకుండా ఆయన వ్యక్తిత్వం, మంచి మనసు వల్లే నానా అందరి హృదయాల్లో నిలిచిపోతారన్నారు. 1994లో నానా పటేకర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగిందని తెలిపారు. నానా పటేకర్ తనతో పాత విషయాలు పంచుకోవడమే కాకుండా, తన తల్లితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారని బాసిత్ అలీ చెప్పారు.

తన జీవితంలో నానా పటేకర్ ఇచ్చిన సలహాను బాసిత్ అలీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. బాసిత్ అలీ తల్లి చనిపోయినప్పుడు నానా ఫోన్ చేసి, ‘బాసిత్, ఇకపై కొంచెం జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు చూసుకో’ అని చెప్పిన మాటలు ఇప్పటికీ తన మనసులోనే ఉన్నాయన్నారు. కష్టకాలంలో మనకు తోడుగా నిలిచే కొద్దిమంది వ్యక్తుల్లో నానా ఒకరని కొనియాడారు. అలాగే తన ఆరోగ్యానికి సంబంధించిన మరొక భావోద్వేగ సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. బాసిత్ అలీకి గుండె సంబంధిత సమస్య వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నానా పటేకర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందట. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకుని, కోలుకున్నాక తనకు ఫోన్ చేయమని కోరారట. ఆ తర్వాత బాసిత్ ఆయనకు కాల్ చేసినప్పుడు, నానా చాలా సమయం కేటాయించి ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. నానా పటేకర్ తెరపై ఎంత గొప్పగా కనిపిస్తారో, నిజ జీవితంలోనూ అంతకంటే గొప్పగా జీవించారని, మనుషులతో సంబంధాలకు, ఇతరుల పట్ల శ్రద్ధ చూపడానికి ఆయన ఎంతో విలువ ఇచ్చేవారని కొనియాడారు. నానా పటేకర్‌కు 75 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మలేరని, తాను ఆయనను ఎప్పుడూ సరదాగా ‘యంగ్ మ్యాన్’ అని పిలిచేవాడినని బాసిత్ గుర్తు చేసుకున్నారు. దానికి నానా కూడా నవ్వుతూ ‘నువ్వూ ముసలివాడివే, నేనూ ముసలివాడినే’ అని సరదాగా బదులిచ్చేవారట. నానా లాంటి ఒక మంచి మనిషిని కోల్పోవడం పూడ్చలేని లోటని, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని బాసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.