Bangladesh Captain Shakib Al Hasan doubtful for India Clash due to Injury: ప్రపంచకప్ 2023లో అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లపై ఓడిన బంగ్లా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు బంగ్లా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌తో మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది.
చెన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. పరుగు తీస్తుండగా అతడు గాయపడ్డాడు. గాయం తర్వాత కూడా షకీబ్ బ్యాటింగ్ కొనసాగించాడు. అంతేకాదు 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. బౌలింగ్ చేసే క్రమంలో షకీబ్ నొప్పితో బాదపడినట్లు కనిపించాడు. అయితే మ్యాచ్ అనంతరం చెన్నైలో అతడికి స్కానింగ్ చేయగా.. గాయం తీవ్రత తెలిసింది. దాంతో అతడు భారత్‌తో మ్యాచ్ ఆడటం కష్టంగా మారింది.
Also Read: Australia vs Sri Lanka: ఈరోజు కలిసొచ్చింది.. ఇదే జోరును కంటిన్యూ చేస్తాం: ప్యాట్ కమిన్స్
షకీబ్ అల్ హసన్ గాయంపై బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ స్పందించాడు. ‘షకీబ్ అల్ హసన్ గాయం మెరుగుపడుతోంది. ప్రస్తుతం అతడికి నొప్పి లేదు. వికెట్ల మధ్య కూడా పరుగులు తీస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడిని నిశితంగా పరిశీలిస్తాం. పూణేలో తుది నిర్ణయం తీసుకుంటాం. భారత్‌పై ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తాం. అయితే మేం రిస్క్ తీసుకోలేం. ప్రపంచకప్ 2023 క్యాంపెయిన్‌లో ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున మేం జాగ్రత్తగా ఉండాలి’ అని మహమూద్ తెలిపాడు.