Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా భాలుకాలో గురువారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఓ హిందూ వర్కర్‌ని కొట్టి చంపేశారు. ఈ ఘటన భాలుకాలోని స్క్వేర్ మాస్టర్ బారి ప్రాంతంలోని దుబాలియా పారా వద్ద జరిగింది. కొట్టిచంపిన తర్వాత దుండగులు ఆ యువకుడి మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారని భాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపోన్ మియా “బీబీసీ బంగ్లా”కు తెలిపారు. మృతుడిని దీపు చంద్ర దాస్‌గా గుర్తించారు. అతడు స్థానిక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ.. ఆ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.
READ MORE: This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
“గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం)పై అవమానకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో కోపంతో ఉన్న ముస్లిం గుంపు అతన్ని పట్టుకుంది. తీవ్రంగా కొట్టి చంపి, తర్వాత మృతదేహాన్ని చెట్టుకి కట్టేసి నిప్పు పెట్టారు” అని రిపోన్ మియా చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీపు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మోర్గ్‌కు పోస్టుమార్టం కోసం పంపించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. తాము అతడి బంధువులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని.. కేసు నమోదు అయిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.