44 Killed in Dhaka Fire Accident: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి.. కనీసం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చాలా మంది అపస్మారక స్థితిలో ఉండగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఢాకా బెయిలీ రోడ్డులోని ఏడు అంతస్తుల భవనం గ్రీన్ కోజీ కాటేజ్‌లోని ఓ బిర్యానీ రెస్టారంట్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్ షిహబ్ తెలిపారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు విస్తరించి పెను ప్రమాదం చోటుకుందని చెప్పారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు షిహబ్ పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.
Also Read: Water Apple: వాటర్ యాపిల్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
భవనంలో మంటలు చెలరేగడంతో కింది అంతస్థుల వారు మెట్ల మార్గం ద్వారా పైకి పరుగెత్తుకెళ్ళారు. కొందరు నీటి పైపుల ద్వారా కిందకు దిగారు. కొందరు పై నుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది పూర్తిగా భవనం పైకి చేరుకుని.. సాయం కోసం కేకలు వేశారు. బంగ్లాదేశ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. 2021లో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో చెలగరేగిన మంటల్లో 52 మంది దుర్మరణం చెందారు. 2019లో ఓ అపార్ట్‌మెంట్ బ్లాకుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మంది మృతి చెందారు.