NTV Telugu Site icon

Krishna Mohan Reddy : “ఫొటో కల్లోలం: ఎమ్మెల్యేనా? పోస్టర్ స్టార్ నా?”

Krishna Mohan Reddy Ktr

Krishna Mohan Reddy Ktr

Krishna Mohan Reddy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చూసి బాధపడటమే కాక, వాటిని పెట్టిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. “నేను కాంగ్రెస్ లో చేరానా, లేదా మరి ఫొటో మాత్రం చేరిపోయిందా?” అని ఆయన ముక్కు వేలేసుకుని గట్టిగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే… ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తలరాత మారిపోయినా, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే! మరి ఇన్నాళ్లకు ఫ్లెక్సీ ఫిర్యాదు ఎందుకు? ఎక్కడో అనర్హత వేటుపడుతుందేమో అనే భయం బలంగా ఉండటంతో “నేను మారలేదు, నా ఫొటో మాత్రమే మారింది!” అని నిరూపించుకోవడానికి ఈ కొత్త “ఫ్లెక్సీ నాటకం” మొదలుపెట్టారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

కేటీఆర్ సెటైర్లు:

“ఇదేందయ్యా? మీ పార్టీ మారడం మాకు తెలియకపోవచ్చు, కానీ మీ ఫొటో మారిందన్న సంగతి కూడా తెలియదా?” ఈ కొత్త రాజకీయ నాటకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ మిస్ అవుతాడు? తనదైన సెటైరికల్ స్టైల్ లో, “అయ్యో పాపం! కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నోటిఫికేషన్ ఫొటోలా అయ్యారు.. అన్నీ రిజిస్టర్ అయినా ఫొటోలు మాత్రం మిస్ అయ్యాయి!” అంటూ ఘాటు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

“నేను ఎక్కడా చేరలేదు.. ఫ్లెక్సీలు వేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి!” అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును చూసి, “మీ పార్టీ మారిన వార్త కన్నా మీ ఫొటో పెట్టిన వార్త ఎక్కువ షాక్ ఇస్తోందయ్యా!” అని కేటీఆర్ చేతులు ఊపేస్తూ నవ్వారట.

ఇదంతా చూస్తుంటే.. ఓటర్లే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరి పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా.. ఓ పార్టీ ఫ్లెక్సీలో ఫొటో పెట్టినందుకు మరొక పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చేమో! “రాజకీయాలు మారిపోవచ్చు.. పార్టీలు మారిపోవచ్చు.. కానీ ఫొటోలు మాత్రం అనుమతిని తీసుకుని మారాలి!” అంటూ ఇప్పుడు గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Mysterious Disease: కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి