NTV Telugu Site icon

Bandi Sanjay : పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదని, అట్లాగే ఇది సంస్కరణల బడ్జెట్ అని, 2027నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఆ దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు, బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిదన్నారు. తెలంగాణసహా దేశంలో లక్ష రూపాయల లోపు జీతభత్యాలు పొందే ఉద్యోగులంతా ఇకపై పన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయం. తద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ.80 వేలు ఆదా అయ్యే అవకాశముంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గబోతున్నాయి. తద్వారా కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు.

అంతేకాకుండా..’ కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంవల్ల ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముంది. ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంతోపాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ రైతులకు వరం. 7.7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయం. తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా క్రెడిట్(రుణం) లభించే అవకాశముంది. ప్రైవేట్ వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. తక్షణమే తెలంగాణలోని రైతన్నలంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని కోరుతున్నా. వివిధ రకాల పంట ఉత్పత్తులను పెంచి రైతులను అధిక ఆదాయం తెచ్చేలా చేసేందుకు నూతనగా ‘ధన ధాన్య క్రుషి యోజన పథకం’ను ప్రవేశపెట్టడం హర్షణీయం. పప్పు దినసుల కోసం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతోపాటు జాతీయ పత్తి కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో తెలంగాణలో పత్తి, పప్పు దినుసులు పండిస్తున్న రైతులకు అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం రావడంతోపాటు గిట్టుబాటు ధర పెరిగే అవకాశముంది.

ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్ లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గర పరిణామం. ఎంస్ఎంఈ రుణాలను రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్లకు పెంచడంతోపాటు స్టార్టప్ లకు రూ.20 కోట్ల వరకు రుణాలిస్తామని బడ్జెట్లో పేర్కొనడం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం కలగబోతోంది. విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చౌక ధరకే కరెంట్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయం. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు పట్టణాలను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయడం సంతోషంగా ఉంది. పట్టణాభివ్రుద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న క్రుషిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరుతున్నా… మొత్తంగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ (2025-26) దేశ గతిని మర్చబోతుంది. దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్ అన్నట్లుగా… ఈ దేశంలోని 90 శాతం పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను, అభివ్రుద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన బడ్జెట్ చరిత్రలో నిలిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Budget 2025 : బడ్జెట్ తో అరవింద్ కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ