జాతీయ రహదారుల విస్తరణ పనులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈరోజు ఎల్కతుర్తి- సిద్దిపేట (NH-765DG) జాతీయ రహదారి విస్తరణ పనులుసహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ప్రధానమంత్రి నరంద్రమోదీ చేతుల మీదుగా గతేడాది నవంబర్ 12న సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. నాటి నుండి చేపట్టిన పనుల పురోగతితోపాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏయే పనులు చేపట్టాలనే పనులపై సమీక్షించారు. మొత్తం 578.85 కోట్ల రూపాయలతో చేపట్టిన 63.641 కి.మీల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా బండి సంజయ్ కు వివరించారు.
Also Read : Minister Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స, సజ్జల భేటీ
అందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగధామంపల్లి బ్రిడ్జి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు మిట్టపల్లి, ముండ్రాయి, పల్మాకుల, బద్దిపడగ, బస్వాపురం, సముద్రాల, పందిళ్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెలగడ్డ, ముల్కనూర్, కొత్తపల్లి, ఇందిరానగర్, ఎల్కతుర్తి గ్రామాల మీదుగా రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ఈ పనుల్లో భాగంగా బస్వాపూర్, పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 26 మైనర్ బ్రిడ్జీల పునర్నిర్మాణం వివరాలను ఈ సందర్భంగా బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల్లో బాగంగా కల్వర్టు నిర్మాణం, జంక్షన్ ఇంప్రూవ్ మెంట్, రీ అలైన్ మెంట్లు, స్ట్రక్చర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు.
Also Read : Ashu Reddy : కింద నుంచి పై వరకు బ్రాండులే.. డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి పాప
ఈ రహదారిపై ప్రయాణించే ప్రజల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గ్రుహాలు, మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ముల్కనూరు డెయిరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని పేర్కొన్నారు. రహదారి విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వివరాలను సైతం బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు.
