NTV Telugu Site icon

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రో కో

Bandi Snajay

Bandi Snajay

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరేలా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా గంపెడాశతో ఎదురు చూస్తున్నారని, ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో అమలైన తీరుకు పొంతనే లేదన్నారు. నూటికి 70 శాతం మంది రైతులు రుణమాఫీ అందక తీవ్ర ఆందోళనతో ఉన్నారు. యాసంగి సీజన్ పూర్తయినా, వానాకాలం సీజన్ మొదలైనా రైతు భరోసా ఇవ్వక పెట్టబడికి పైసల్లేక, బ్యాంకుల నుండి రుణాలందక రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతు భరోసా ఇవ్వక, రైతు భరోసా ఇవ్వక, అమలు చేయడం చేతగాని అధికార కాంగ్రెస్ పార్టీ అనేక జిమ్మిక్కులు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తులం బంగారం, స్కూటీతోపాటు ప్రతి మహిళకు నెలకు రూ.2500ల చొప్పున నెలనెలా నగదు ఇస్తామని ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన మహిళలంతా వాటి కోసం గత 8 నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి, వ్రుద్దులందరికీ నెలనెలా రూ.4 వేల చొప్పున ఆసరా పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాటలను నమ్మి రాష్ట్రంలోని నిరుద్యోగులు, వ్రుద్దులంతా ఆశతో ఉన్నారు.

8 నెలలైనా ప్రజలకిచ్చిన హమీలను అమలు చేయాలని ప్రజల్లో చర్చ జరుగుతుంటే వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి తీవ్రమైన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలపై అనేక కేసుల రూపంలో కత్తి వేలాడుతుండటంతో అరెస్టుల నుండి తప్పించుకునేందుకు అధికార పార్టీతో కుమ్కక్కైంది. 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి ప్రజల చర్చను పక్కదారి పట్టిస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన క్విడ్ ప్రో కో (నీకింత..నాకింత లాభం) ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూములు, నయీం డైరీ కేసులను పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా తప్పించారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ ఇప్పించేందుకు స్వయంగా కాంగ్రెస్ నేత కోర్టుల్లో విశ్వప్రయత్నం చేస్తూ వాదనలు విన్పించారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్ధిని నిలబెట్టలేదు. కవిత బెయిల్ కోసం కోర్టులో వాదనలు విన్పించిన నాయకుడినే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెట్టడంతో ఆయన గెలుపును ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టలేదనేది జగమెరిగిన సత్యం. అదే సమయంలో

బాధ్యతాయుతమైన అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న డ్రామాలను, ఇద్దరి మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందాలను బీజేపీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుండటంతో ఓర్వలేని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కుమ్మక్కై ప్రజలకు ప్రయోజనం లేని అంశాలపై లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయి. అట్లాగే బీజేపీని బదనాం చేసేందుకు అదానీ, సెబీ అంశాలను సీఎం రేవంత్ రెడ్డిసహా కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చి మీడియాను సైతం పక్కదారి పట్టిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూపు ఛైర్మన్ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమై తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీతో బీజేపీ కుమ్కక్కైందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీనికేం సమాధానం చెబుతారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తే సంసారం… ఇతర పార్టీల నేతలు చేస్తే వ్యభిచారం’ అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు గాయిగాయి చేయడం సిగ్గు చేటు. బీఆర్ఎస్ నేతలు సైతం 6 గ్యారంటీలను గాలికొదిలేసి విగ్రహాల తొలగింపు పేరుతో రాజకీయం చేస్తూ ప్రజలను తప్పిదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డ్రామాలను గమనిస్తున్నారని, సమయమొచ్చినప్పుడు కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలుపై ద్రుష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.’ అని బండి సంజయ్‌ అన్నారు.