తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అధికారం పోతుంది అంటే కేసీఆర్ పీఎఫ్‌ఐ లాంటి సంస్థలను రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ఎన్ఐఏ సోదాలు చేస్తేనే 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారని, ఉగ్రవాదులకు అడ్డగా తెలంగాణ రాష్ట్రం మారిందని ఆయన విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి బీజేపీని బద్నాం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అంశాలను తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు బండి సంజయ్. మళ్లీ పక్కాగా అంటాం సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. హైదరాబాద్ ఎవరు అయ్యా జాగిర్ కాదు అంటూ ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాదులో వీసా లేకుండా పాస్‌పోర్ట్ లేకుండా వచ్చి జీవిస్తున్నారని, సంఘ విద్రోహ శక్తుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా సర్జికల్ స్ట్రైక్ చేసి తీరుతామన్నారు. మేము మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతలేమని, ప్రశాంత వాతావరణము ఉన్న భారత దేశాన్ని చెడగొడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు.
Also Read : Tirumala Temple: మరికాసేపట్లో శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు
తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీకి బంధం తెగిపోయిందని, కేసీఆర్ నుండి తెలంగాణ తల్లి బంధ విముక్తిరాలైనదన్నారు. ఆంద్రప్రదేశ్ నుండి కొంతమంది టీడీపీ, కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు అంటా.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక బీజేపీ భయానికి తెలంగాణ నుండి పారిపోయాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశం మొత్తం తిరిగేందుకు సిద్ధం అవుతున్నాడని ఆయన అన్నారు. చిట్టీల కంపెనీల బోర్డు తిప్పేసినట్లు టీఆర్ఎస్ బోర్డును బీఆర్ఎస్‌గా తిప్పిండు అంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్రం ఇచ్చిన నిధులతోనేనని ఆయన అన్నారు. నేను కేటీఆర్ ను విమర్శలు చేస్తున్నానని విమర్శలు చేయవద్దు అంటూ హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు.
