NTV Telugu Site icon

BAN vs PAK: రిక్షా పుల్లర్‌కు నా అవార్డు అంకితం: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్

Mehidy Hasan

Mehidy Hasan

పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ చిరస్మరణీయ టెస్టు సిరీస్‌ విజయం అందుకుంది. పాక్‌ను దాని సొంత గడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పైనే కాకుండా పాకిస్థాన్‌పైనా టెస్టు సిరీస్‌ గెలిచిన బంగ్లా.. తాము పసికూన కాదని మరోసారి నిరూపించుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. బంగ్లా క్రికెట్‌ టీమ్‌ అపూర్వ విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్లు తీసిన బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కింది. ఈ అవార్డును అతడు బంగ్లా నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ రిక్షా పుల్లర్‌కు అంకితం ఇచ్చాడు. అవార్డు తీసుకున్న అనంతరం మెహిదీ హసన్ మాట్లాడుతూ… ‘విదేశీ గడ్డపై నాకు ఇదే మొదటి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు. 8వ స్థానంలో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. ఇతర బ్యాటర్ల సాయంతో స్ట్రైక్‌ను రొటేట్ చేయడానికి ప్రయత్నించా. లిటన్ దాస్‌, ముష్ఫికర్‌తో మంచి భాగస్వామ్యాలు నిర్మించా. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌నూ ఎంతో ఆస్వాదించా. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఎప్పుడూ సంతోషమే’ అని అన్నాడు.

Also Read: Gold Rate Today: దిగొస్తున్న పసిడి ధరలు.. 10 రోజుల్లో ఒకేసారి! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

‘టీ20 ప్రపంచకప్‌ 2024లో నేను ఆడలేదు. జట్టులోకి తిరిగి వచ్చాక మంచి ప్రదర్శన ఇస్తున్నా. పాకిస్థాన్‌పై సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో ప్రతిఒక్కరి పాత్ర ఉంది. బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఈ సమయంలోనూ మేం విజయం సాధించాం. నా అవార్డును విద్యార్థుల నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రిక్షా తొక్కే వ్యక్తికి అంకితం ఇస్తున్నా’ అని మెహిదీ హసన్ చెప్పాడు. పాకిస్థాన్‌పై రెండు టెస్టుల్లో 155 పరుగులు చేసిన మెహిదీ హసన్.. 10 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్స్ ప్రదర్శన కూడా ఉంది.

Show comments