తెలంగాణ.. మంచిర్యాల జిల్లాలో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్థరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇలా జరిగింది. మందమర్రి మండలం.. గుడిపల్లి వెంకటాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులను బాల్క సుమన్ పరామర్శించారు.
మృతుల్లో వెంకటాపూర్ గ్రామస్తులు ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ, రాజ్యలక్ష్మి అక్క కూతురు కోటపల్లి మండలం కొండంపేట్ గ్రామానికి చెందిన మౌనిక, మౌనిక ఇద్దరు పిల్లలు స్వీటీ, హిమబిందు, సింగరేణి కార్మికుడు శాంతయ్య మొత్తం 6 గురు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని తమని తీవ్రంగా కలచివేసిందన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ విచారణ కొనసాగుతుంది. సంఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ కుట్ర కోణం ఏదైనా ఉంటే నిందితులు ఎవరైనా ఉపేక్షించబోమని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు.