క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూ్స్ చెప్పాయి. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులు కూడా దాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్తు, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె క్రెడిట్ కార్డుతో చెల్లిస్తుంటాం. ఇలా చెల్లిస్తే ఒకప్పుడు రివార్డులు వచ్చేవి. కాని ఇకపై పరిస్థితి మారనుంది. అప్పటికే అద్దెపై సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర బిల్లులకు సైతం వాటిని విస్తరించేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి. దీంతో వినియోగదారులకు అదనపు భారం పడనుంది. ఆ బ్యాంకులు ఏ వంటే..ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్ సీ బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
మే 1 నుంచి క్రెడిట్ కార్డులతో చెల్లించే బిల్లులపై 1 శాతం రుసుము వసూలు చేయనున్నాయి. ఒకవేళ 1,500 రూపాయలు గ్యాస్ బిల్లు చెల్లిస్తే.. రూ. 15 రుసుము అదనంగా పడుతోందన్న మాట. ఇది అందరికీ వర్తించదని బ్యాంకులు తెలిపాయి. ఎస్ బ్యాంకులో అయితే నెల వారీ యుటిలిటీ బిల్లులు రూ.15,000 దాటితేనే ఒక శాతం అదనపు రుసుము వర్తింపజేస్తుంది. అంటే 15 వేల రూపాయలు దాటితేనే అదనపు భారం పడుతుందన్న మాట. క్రమంగా ఎన్ని సార్లు చెల్లిస్తే అన్ని సార్లు రుసుము చెల్లించాల్సిందే. ఐడీఎఫ్ సీ బ్యాంకు పరిమితి రూ. 20వేలుగా ప్రకటించింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై పేమెంట్ గేట్వేలు వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే ఛార్జీలు “మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అంటారు. కేటగిరీని బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకు నిత్యావసరాలకు, ట్రావెల్ తదితరాలకు వేర్వేరుగా ఉంటుంది. కాని యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఎండీఆర్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో బ్యాంకులకు తక్కువ ఆదాయం సమకూరుతుంది. కొంత మంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే.. యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. కొందరు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపార అవసరాలను కూడా యుటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు. అదనపు రుసుము విధించడంతో దాన్ని కూడా నివారించవచ్చని ఆయా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.