NTV Telugu Site icon

BAC Meeting: ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో ఖరారు

Bac Meeting

Bac Meeting

BAC Meeting: ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీలో ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.

Read Also: CM Chandrababu: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. గత సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లులను ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది.

అనంతరం సభాపతి అయ్యన్నపాత్రుడు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. గత సమావేశాలు వరకూ గవర్నరుని అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని.. ఈ సమావేశాలకు గవర్నరును రాచమార్గంలో ముందు వైపు నుంచి తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్-2 తలుపులు తీశామన్నారు. నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారని.. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని వెల్లడించారు. ల్యాoడ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుందని స్పీకర్ వెల్లడించారు. 88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయి ఉన్నాయన్నారు. 6 నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామన్నారు. 9 నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని సభాపతి స్పష్టం చేశారు.