NTV Telugu Site icon

Babar Azam: బాబర్‌ అజామ్‌ సంచలన నిర్ణయం!

Babar Azam

Babar Azam

Babar Azam Captaincy: పాకిస్తాన్ స్టార్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఎక్స్‌ వేదికగా తెలిపాడు. పాక్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవం అని, అయితే కెప్టెన్సీని వదులుకొని ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే, టీ20ల నుంచి బాబర్‌ తప్పుకోవడంతో.. పీసీబీ ఎవరిని కెప్టెన్ చేస్తుందో చూడాలి.

‘నేను ఈ రోజు మీతో ఓ విషయం పంచుకుంటున్నాను. పాక్ క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవంగా ఉంది. అయితే కెప్టెన్సీని వదులుకొని నా ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్సీ గొప్ప అనుభవం. అయితే దానివల్ల పని భారం పెరుగుతోంది. ఇక నుంచి నా ఆటకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా. నా బ్యాటింగ్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకుంటున్నా. నా విలువైన సమయాన్ని కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నా. జట్టుగా కలిసి సాధించిన దాని గురించి ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి ఆటగాడిగా జట్టుకు నా సహకారాన్ని అందిస్తా. ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని బాబర్‌ అజామ్‌ పేర్కొన్నాడు.

Also Read: Virat Kohli Bat: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌కు విరాట్‌ కోహ్లీ బ్యాట్‌!

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేయడంతో బాబర్‌ అజామ్‌ను పీసీబీ కెప్టెన్సీ నుంచి తప్పించింది. టీ20లకు షహీన్‌ అఫ్రిదిని, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయితే అఫ్రిది నేతృత్వంలో న్యూజిలాండ్‌పై 4-1 తేడాతో సిరీస్ కోల్పోవడంతో మళ్లీ బాబర్‌కే బాధ్యతలు వచ్చాయి. బాబర్‌ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్‌ 2024 ఆడిన పాక్.. ఘోర ప్రదర్శన చేసింది. భారత్‌తో సహా పసికూన యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయింది. దీంతో కెప్టెన్‌ సహా జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వ్యక్తిగతంగా గొప్ప ప్రదర్శనలు చేసిన బాబర్‌.. ఐసీసీ టోర్నీలను మాత్రం గెలవలేకపోయాడు. బాబర్‌ ఇప్పటివరకు 54 టెస్టు మ్యాచ్‌ల్లో 3962 పరుగులు, 117 వన్డేల్లో 5729 పరుగులు, 123 టీ20ల్లో 4145 పరుగులు చేశాడు.