Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తికోసం అధికారులు గాలిస్తున్నారు. తాజాగా రష్యా నుంచి గోవాకు వస్తున్న చార్టెడ్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హడలిపోయారు. అధికారుల హెచ్చరికతో రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు దారిమళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.
Read Also: Brutally Killed: కత్తులతో 282 సార్లు పొడిచి తల్లిదండ్రులను చంపిన కొడుకు
వాస్తవానికి ఆ చార్టెడ్ ఫ్లైయిట్ గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారతీయ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించకముందే దాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 నిమిషాలకు గోవా ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించాలని అధికారులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవాకు వస్తున్న ఓ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడం వల్లే ఆ విమానాన్ని దించారు. ఇలా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారం అయిపోయింది. ఉత్తుత్తి బాంబు బెదిరింపులు చేస్తున్న వారిని గుర్తిస్తున్న పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. బాంబు బెదిరింపుల కేసుల్లో చాలా మంది జైలుకు వెళ్లినా ఇంకా ఇలాంటి బాంబు బెదిరింపుల ఫోన్లు, ఈమెయిల్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.