Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!

  • రంజీ ట్రోఫీలో ఆయుష్ బదోని వరుసగా రెండో డబుల్ సెంచరీ
  • జార్ఖండ్‌పై 228 బంతుల్లో 210 పరుగులతో అజేయంగా..
  • అంతకుముందు గుజరాత్‌పై 217 పరుగులు
  • వరుస రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు
  • విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సరసన చోటు..
Ayush Badoni

Ayush Badoni

Ayush Badoni: రంజీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని పరుగుల వరద పారిస్తున్నాడు. గుజరాత్‌పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన బదోని.. తాజాగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మరో ద్విశతకం బాదాడు. దీంతో వరుసగా రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన అరుదైన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బదోని ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. కేవలం 216 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. చివరకు 228 బంతుల్లో 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బదోని మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ భారీగా 515 పరుగులు చేసింది. ఇదే రంజీ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బడోని 217 పరుగులు చేశాడు. ఇప్పుడు జార్ఖండ్‌పై 210 నాటౌట్‌తో మరో ద్విశతకం సాధించాడు. అంతకుముందు సీజన్ తొలి మ్యాచ్‌లో 23, 85 పరుగులు చేసిన బదోని.. ఆ తర్వాత వరుసగా 217, 210 పరుగులతో సంచలన ఫామ్‌లోకి వచ్చాడు.

వరుసగా రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించడంతో బదోని భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు. ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్లలో బదోని 21వ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించడం అత్యంత అరుదైన రికార్డు కాగా.. వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాటర్ ఇప్పటివరకు లేడు. ఈ అరుదైన జాబితాలో కేఎస్ రంజిత్‌సింహ్‌జీ, నవాబ్ పటౌడీ, విజయ్ మర్చంట్, రూసీ మోదీ, దిలీప్ వెంగ్‌సర్కార్, అరుణ్ లాల్, డబ్ల్యూవీ రామన్, వినోద్ కాంబ్లీ, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, మిలింద్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, ఎన్. జగదీశన్, అగ్ని చోప్రా, స్నేహల్ కౌతంకర్ వంటి పలువురు దిగ్గజాలు ఉన్నారు.

టీ20 క్రికెట్‌లో ఎక్కువగా కనిపించే ఆయుష్ బదోని.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం మరింత అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 63.84 సగటుతో 2,426 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు డబుల్ సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వరుస డబుల్ సెంచరీలతో తన ఫస్ట్‌క్లాస్ సత్తాను మరోసారి చాటుకున్నాడు. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ బడోనికి ఇప్పటివరకు ఇండియా-A జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్‌లోనూ అతడికి అవకాశం రాలేదు.