Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Axar Patel

Axar Patel

Axar Patel: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ అక్షర్ పటేల్.. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ పునరాగమనంపై ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించిన వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ట్రేడింగ్ ద్వారా రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ స్వయంగా తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడిన సంభాషణను అక్షర్ పటేల్ ఓ వీడియోలో వివరించాడు.

“అతనిపై నాకు ఉన్న ప్రేమే అతడిని తిరిగి ఢిల్లీకి లాక్కొచ్చింది” అంటూ అక్షర్ పటేల్ తన మాటలను ప్రారంభించాడు. ఈ డీల్ ఓకే అయిన తర్వాత పంత్ నుంచి తనకు మొదటిసారి కాల్ వచ్చినప్పుడు.. తాను బాబుతో గడుపుతూ ఫోన్‌ను పక్కన పెట్టేయడం వల్ల లిఫ్ట్ చేయలేకపోయానని అక్షర్ చెప్పాడు. పంత్ రెండోసారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. ఆ తర్వాత రాత్రి వేళ బాబు పడుకున్నాక, అక్షర్ పటేల్ తిరిగి పంత్‌కు ఫోన్ చేసి.. “భాయ్.. ఏమైంది? ఏమైనా అర్జెంట్ మ్యాటరా?” అని అడిగాడు. దానికి పంత్ ఎంతో సంతోషంగా.. “భాయ్.. అంతా కన్ఫర్మ్ అయిపోయింది, నేను మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చేస్తున్నాను” అని సమాధానమిచ్చాడట. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇదేనని, ఆ తర్వాత ఇద్దరూ ఎంతో సాధారణంగా మాట్లాడుకున్నారని అక్షర్ ఆ వీడియోలో తెలిపాడు. పంత్ కూడా “చివరికి నేను మళ్లీ నా సొంత గూటికి (హోమ్) వచ్చేస్తున్నాను” అని సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పాడు. అయితే ఆ సమయంలో తన మనసులో ఒక మాట అనుకున్నానని, కానీ దానిని పంత్‌కు చెప్పలేదని అక్షర్ ఎమోషనల్ అయ్యాడు. “ఉదయం దారి తప్పిన వాడు సాయంత్రానికి మళ్లీ ఇంటికి తిరిగి వస్తే, అతడిని దారి తప్పిన వాడు అనరు” అనే సామెతను అక్షర్ గుర్తుచేసుకున్నాడు. తమ ఇద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహ బంధమే పంత్‌ను మళ్లీ ఢిల్లీ వైపు అడుగులు వేసేలా చేసిందని అక్షర్ పటేల్ అన్న మాటలు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.

×
×
Ad