దేశంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారిపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. ఎన్ని కఠిన చట్టాలు చేసిన, స్పెషల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినా వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డులేకుండా పోతుంది. దీనికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రోజూ వైరల్ అవుతున్నాయి. మహిళలు స్వయంగా తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిసారి మహిళల వెంట ఎవరో ఒకరు తోడుగా ఉండటం కుదరదు. కాబట్టి మహిళలు ఆత్మరక్షణ శిక్షణ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ప్రభుత్వ యాజమాన్య సంస్థ అయిన అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ ఓ రివాల్వను తయారు చేసింది. ప్రబల్ అని పిలువబడే ఇండియాలో మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ అయిన ఇది ఆగస్టు 18వ తేదీన విడుదల కానుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్ నిర్మాణంలో భాగంగా 2021లో ఏడు పీఎస్ యూలను ఏర్పాటు చేసింది. ఇవి కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తాయి. వాటిలో ఏడబ్ల్యూఈఐఎల్ కూడా ఒకటి. ఈ సంస్థ భద్రతా దళాలతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆర్డర్లను సైతం తీసుకొని ఆయుధాలను తయారుచేస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఈ సంస్థ రూ.6వేల కోట్ల విలువైన ఆయుధాల తయారీ ఆర్డర్లను, రూ. 450 కోట్ల విలువైన ఇతర దేశాలకు చెందిన ఆర్డర్లను సైతం సొంతం చేసుకుంది.
Also Read: Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
ప్రబల్ రివాల్వర్ మహిళలు ఉపయోగించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఎందుకంటే దీని బరువు తక్కువ అంతేకాదు దీని సైజ్ కూడా చిన్నదిగానే ఉంటుంది. ఇది కేవలం 76మి.మీ సైజుతో 700 గ్రాములు మాత్రమే ఉండనుంది. దీనిని లైసెన్స్ తీసుకొని కొనుక్కుంటే ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. దీనిపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. గతంలో తయారు చేసిన రివాల్వర్ రేంజ్ కేవలం 20 మీటర్లు మాత్రమే కాగా, ఈ కొత్త వెన్షన్ రివాల్వర్ రేంజ్ దాదాపు 50 మీటర్ల వరకు ఉంటుందట. కావాలనుకున్న వారు దీనిని లైసెన్స్ తీసుకొని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.