Marcus Stoinis: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైన జట్టులో భాగంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కేవలం వన్డే క్రికెట్‌కి మాత్రమే పరిమితమని, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని స్టోయిన్స్ స్పష్టం చేశాడు. అయితే, వన్డే క్రికెట్ నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకోవడం సులభం కాలేదని మార్కస్ స్టోయిన్స్ చెప్పాడు. ఇది నా జీవితంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయాల్లో ఒకటి. కానీ, నా కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఇకపై నా దృష్టి మొత్తం టీ20 ఫార్మాట్‌పైనే ఉంటుందని స్టోయిన్స్ పేర్కొన్నాడు.
Also Read: YS Jagan: అప్పుల్లో రికార్డ్ బద్దులుకొట్టిన కూటమి ప్రభుత్వం..
మార్కస్ స్టోయిన్స్ రిటైర్మెంట్ నిర్ణయం ఆసీస్ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీలో పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోయిన్స్ వెనక్కి తగ్గడం జట్టుకు మరింత ఇబ్బందిగా మారింది. మార్కస్ స్టోయిన్స్ వన్డేల్లో బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా కీలక ఆటగాడు. స్టోయిన్స్ 71 వన్డే మ్యాచ్‌లు ఆడి 1495 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను ఒక శతకం, ఆరు అర్ధశతకాలు సాధించాడు. అలాగే, బౌలింగ్‌లో 48 వికెట్లు తీశాడు. 2015 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అతని వన్డే అరంగేట్రం జరిగింది. అతని చివరి వన్డే మ్యాచ్ 2024 నవంబర్‌లో హోబార్ట్ వేదికగా పాకిస్థాన్‌పై ఆడాడు.
Also Read: Allu Aravind: సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
స్టోయిన్స్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతాడు. టీ20 క్రికెట్‌లో సత్తా చాటడంపైనే తన పూర్తి దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు. టీ20 లీగ్‌లు, ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ (BBL), ఇతర దేశీ లీగ్‌లలో స్టోయిన్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో స్టోయిన్స్ రిటైర్మెంట్ ఆ జట్టు బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే, అతని స్థానంలో ఎవరు ఆడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.