మహిళా వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ టీమ్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అగ్రస్థానం ఎవరిది అనేది తేలిపోతుంది. సెమీస్‌లో భారత జట్టు ఎదురయ్యే ప్రత్యర్థి ఎవరో కూడా ఆ మ్యాచ్‌తో తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వేధింపులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లు దిగారు. గురువారం ప్లేయర్లు హోటల్ గది నుంచి కెఫేకు నడిచి వెళుతుండగా.. అకీల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరు మహిళా క్రికెటర్లను వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆసీస్ జట్టు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు అకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన పట్ల ఆసీస్ ప్లేయర్స్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.