బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. రోహిత్ తన సతీమణి రితికా సజ్దే ప్రసవం నేపథ్యంలో ముంబైలోనే ఉన్నాడు. రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టీమిండియా కెప్టెన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బోర్డర్-గవాస్కర్ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో జట్టుకు కెప్టెన్ అవసరం ఉంటుందని, రోహిత్ శర్మ త్వరగా ఆస్ట్రేలియా వెళ్లి తొలి టెస్టు ఆడితే బాగుంటుందని సౌరవ్ గంగూలీ అన్నారు. రెవ్ స్పోర్ట్స్‌తో దాదా మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ సతీమణి రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చారు. హిట్‌మ్యాన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలొస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ లాంటి పెద్ద సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా కెప్టెన్ వదిలేయకూడదు. టెస్ట్ సిరీస్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. రోహిత్ ఆస్ట్రేలియాకు త్వరగా వెళ్లాలి. అతడు పెర్త్ టెస్టు ఆడితే బాగుంటుంది. ఒకవేళ నేను రోహిత్ స్థానంలో ఉంటే.. కచ్చితంగా ఆసీస్ వెళ్లి ఆడేవాడిని. ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభానికి మంచి నాయకత్వం అవసరం. గతంలోరోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ తీసుకోవాలని చాలాసార్లు మాట్లాడి ఒప్పించా. టెస్టులకు కెప్టెన్సీ చేయకుండా కెరీర్ ముగించవద్దని చెప్పా’ అని తెలిపారు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే భారత్‌ను గాయాల బెడద వేధిస్తోంది. వార్మప్ మ్యాచ్, ప్రాక్టీస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీలు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. గిల్ తొలి టెస్టులో ఆడేది అనుమానంగానే మారింది. అతడి చేతి వేలు విరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరి గిల్ స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి. పెర్త్ టెస్టులో ధ్రువ్ జురెల్ ఆడటం ఖాయమని తెలుస్తోంది.