NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్‌.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!

Virat Kohli Test

Virat Kohli Test

గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్‌ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్‌ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డారు.

ఓ క్రీడా ఛానల్‌తో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఒక ఛాంపియన్ ఆటగాడు. అతని వన్డే గణాంకాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి. గతంలో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో మంచి విజయాలు సాధించాడు. 2014లో నాలుగు సెంచరీలు చేశాడు. 2018లో ఒక సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాలో అతని రికార్డులు బాగున్నాయి. ఆస్ట్రేలియాలో 6 టెస్టు సెంచరీలు చేశాడు. ఇది మాములు విషయం కాదు. 28, 29, 30 సంవత్సరాల వయస్సులో గేమ్ భిన్నంగా ఉంటుంది. 36, 37 సంవత్సరాల వయస్సులో మరోలా ఉంటుంది. ఆసీస్ గడ్డపై ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు’ అని చెప్పారు.

Also Read: Vivo Y18t Price: ముందస్తు సమాచారం లేకుండా.. 10 వేలలో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన ‘వివో’!

‘బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని విరాట్ కోహ్లీ సీరియస్‌గా తీసుకుంటాడు. విరాట్ రాణిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాలో వికెట్ వేగంగా ఉంటుంది. పిచ్‌పై పేస్, బౌన్స్ ఉంటుంది. కూకబుర్రా బంతితో సీమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అతనికి మంచి సిరీస్ అవుతుంది. టెస్టు క్రికెట్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం కెరీర్‌లో ఇదే చివరిసారని అతడికి తెలుసు. కాబట్టి ఈ సిరీస్‌ కోహ్లీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం అవుతుంది’ అని దాదా చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 24 టెస్ట్ మ్యాచ్‌ల్లో 42 ఇన్నింగ్స్‌లలో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.