Site icon NTV Telugu

Asia Cup 2025: స్టార్‌ పేసర్‌ ఎంట్రీ.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!

India squad Asia Cup

India squad Asia Cup

India Predicted Squad for Asia Cup 2025: యూఏఈలో సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్‌ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఈనెల 19 లేదా 20న అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకటి, రెండు స్థానాలకు మినహా జట్టుపై బీసీసీఐ సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. పనిభార నిర్వహణలో భాగంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన బుమ్రా.. ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో జరగనున్న విషయం తెలిసిందే.

టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ సెలక్టర్లు పర్యవేక్షించనున్నారు. సూర్య ఫిట్‌నెస్‌ టెస్ట్ క్లియర్ చేస్తాడని సెలక్టర్లు నమ్మకంగా ఉన్నారు. వైస్‌ కెప్టెన్సీ కోసం అక్షర్‌ పటేల్‌, శుభ్‌మన్‌ గిల్ మధ్య పోటీ నెలకొంది. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా ఉంచాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైస్‌ కెప్టెన్సీ ఇచ్చి.. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం కెప్టెన్‌గా చేసే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉందట. గతేడాది శ్రీలంకతో సిరీస్‌లో గిల్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

టీ20ల్లో ఇటీవలి బ్యాటింగ్‌ లైనప్‌నే ఆసియా కప్‌ 2025లో కొనసాగించే అవకాశాలున్నాయి. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా ఆడనున్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ, రింకు సింగ్, హార్దిక్‌ పాండ్యాలు కొనసాగనున్నారు. శుభ్‌మన్‌ గిల్ టాపార్డర్‌లో ఆడనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండో కీపర్‌గా జితేశ్‌ శర్మ, ధ్రువ్‌ జురెల్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. గాయంతో బాధపడుతున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఎంపికయ్యే అవకాశం లేదు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌, కేఎల్‌ రాహుల్‌లకు చోటు దక్కడం కష్టమే.

స్పిన్‌ ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌ ఆడనున్నారు. కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆడడం ఖాయం. మూడో సీమర్‌గా ప్రసిద్ధ్‌ కృష్ణ ఆడే అవకాశాలు ఉన్నాయి. హర్షిత్‌ రాణాకు చోటు దక్కడం కష్టమే. ఇంగ్లండ్ గడ్డపై రాణించిన మహమ్మద్ సిరాజ్ కూడా అదే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యామ్యాయ ఆటగాళ్లుగా ఎవరికి చోటు దక్కుతుందో అని ఆసక్తికరంగా ఉంది.

భారత జట్టు (అంచనా):
అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ, రింకు సింగ్, హార్దిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా/ మహమ్మద్ సిరాజ్.

Exit mobile version