Ashwini Vaishnaw: ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇండస్ట్రీ లీడర్ టౌన్ హాల్’ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, బుల్లెట్ ట్రైన్, రైల్వే ఆధునికీకరణ వంటి రంగాల్లో జరుగుతున్న మార్పులను వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి ఎలక్ట్రానిక్స్, ఐటీ, చిప్ డిజైన్ రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉందని చెప్పారు.
విద్యార్థులకు సెమీకండక్టర్ డిజైన్‌లో ప్రోత్సాహం అందించేందుకు సైనాప్సిస్, క్యాడెన్స్ వంటి అత్యాధునిక EDA టూల్స్‌ను 315 విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. విద్యార్థులు స్వయంగా చిప్‌లను డిజైన్ చేసి, మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్‌లో వాటిని తయారు చేసి పరీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో చాలా కొద్ది విశ్వవిద్యాలయాలకే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని అన్నారు.
దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రెండంకెల వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ రూ.13 లక్షల కోట్లకు చేరుకుందని, త్వరలోనే రూ.20 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఈ రంగం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. ఈ మధ్య భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువుల్లో మొబైల్ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయని, ఒకప్పుడు పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆధిపత్యం ఉన్నా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం వాటిని అధిగమించిందని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం 104 ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు పనిచేస్తున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 4 భారీ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ప్రోటోటైప్ డిజైన్, టెస్టింగ్, వ్యాలిడేషన్ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్ మధ్య వేగంగా నిర్మాణంలో ఉందని.. 2027లో తొలి దశ సేవలు ప్రారంభమవుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇదే అనుభవంతో దేశంలో మరో ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు.
హైదరాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొంటూ.. నగరం నుంచి హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు. దీనివల్ల హైదరాబాద్-అమరావతి మధ్య 1 గంట 10 నిమిషాలు, హైదరాబాద్-బెంగళూరు మధ్య 2 గంటల 35 నిమిషాలు, హైదరాబాద్-చెన్నై మధ్య 3 గంటలు, హైదరాబాద్-పుణె మధ్య 2 గంటల 3 నిమిషాలు, పుణె-ముంబై మధ్య 48 నిమిషాలు మాత్రమే అని తెలిపారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.880 కోట్ల రైల్వే బడ్జెట్ మాత్రమే వచ్చేదని, ప్రస్తుతం తెలంగాణకే రూ.5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయిస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నామని.. నాంపల్లి, బేగంపేట, హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ వంటి స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే కార్యక్రమంలో ఇప్పటికే 260కు పైగా స్టేషన్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
వందేభారత్ రైళ్లు ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడ్డాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. తెలంగాణకు ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో మరిన్ని సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా 36,000 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌లు నిర్మించామని తెలిపారు. అలాగే 2,700 కి.మీ. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో 99.4% విద్యుద్దీకరణ పూర్తయిందని, దీంతో డీజిల్‌పై ఆధారపడటం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.
దేశంలో ప్రస్తుతం అభివృద్ధి, పనితీరు ఆధారిత రాజకీయాలే నడుస్తున్నాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తోనే బుల్లెట్ ట్రైన్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆధునిక రైల్వే వ్యవస్థ వంటి కీలక రంగాల్లో భారత్ ప్రపంచస్థాయికి చేరుకుంటోందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

