సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. హస్తం పార్టీని ఒక్కొక్కరు విడిచిపెడుతున్నారు. ఇటీవలే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు.
తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు.
నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్‌పీ నాయకుడు కూడా. ఇక తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ బీజేపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ తన పదవికి రాజీనామా చేశారు.