NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన ఐదుగురు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబు.ఏ, హరి జవహర్ లాల్, కన్నబాబు, సీహెచ్ హరికిరణ్, వీర పాండియన్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Central Ministers: బీజేపీ నాయకత్వ మార్పులు మరియు కొత్త బాధ్యతలు ఎవరెవరికి..?

వర్షం పడినా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సభాప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను పెడుతున్నారు. విమానాశ్రయం ఎదురుగానే వేదిక ఉండడంతో వీఐపీల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని భావిస్తున్నారు. విమానాశ్రయానికి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక వచ్చేందుకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖుల రాక కోసం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహారిని ఆనుకుని ఉన్న కేసరిపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీల వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం విజయవాడ నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో గదులను ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ‌అధికారులకు సీఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. . అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.