Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్‌’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..

Arnab Cyclone

Arnab Cyclone

Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న ‘అర్నబ్‌’ తుఫాను తీవ్రత శాటిలైట్ చిత్రాల్లో భయానకంగా కనపడుతోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తాకిన అర్నబ్‌ తుఫాను తీరందాటేసింది. ఈ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచగా.. కొన్ని చోట్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవడానికి మన దేశానికి చెందిన ‘ఇన్సాట్-3డీఎస్’ వాతావరణ ఉపగ్రహం కొన్ని చిత్రాలను పంచుకుంది. తూర్పు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలతో పాటు బంగాళాఖాతం మొత్తం తుఫాను మేఘాలతో కమ్ముకుని కనిపిస్తోంది. వాతావరణ శాఖ చెబుతున్నదాని ప్రకారం.. తుఫాను తీరం దాటి భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ, దానివల్ల ముప్పు ఇప్పుడప్పుడే తొలగిపోలేదు. రాబోయే సమయంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, నీరు నిలిచిపోయే ప్రమాదం, వరద ముప్పు పొంచి ఉంది.

ఉపగ్రహం బుధవారం ఉదయం 9:30 నుంచి 9:57 గంటల మధ్య ఈ చిత్రాలను సేకరించింది. ఇందులో తుఫాను మధ్య భాగంలో దట్టమైన మేఘాలు, దూరంగా విస్తరించిన మేఘాల వరసలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావం కేవలం దాని కేంద్రం వద్దే కాకుండా, చాలా పెద్ద ప్రాంతానికి విస్తరించి ఉందని ఈ చిత్రాల ద్వారా అర్థమవుతోంది. అయితే, ఒక ప్రాంతంలో మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన అక్కడ తుఫాను ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశానికి చెందిన ‘ఇన్సాట్-3డీఎస్’ శాటిలైట్ సాయంతో వాతావరణ పరిస్థితులు, మేఘాలు, తుఫానుల కదలికలను నిరంతరం గమనిస్తుంటారు. దీనివల్ల రాత్రి సమయాల్లో కూడా మేఘాల పరిస్థితిని సులభంగా పసిగట్టవచ్చు. ఈ చిత్రాలలో ప్రకాశవంతమైన తెలుపు రంగులో కనిపించేవి ఎక్కడో పైభాగంలో ఉన్న దట్టమైన, చల్లని మేఘాలు. ఇలాంటి మేఘాల వల్లనే భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. చిత్రాలలో మేఘాలు వృత్తాకారంలో తిరుగుతున్నట్లు కనిపించడం బట్టి.. తుఫాను చుట్టూ గాలి ఏ దిశగా ప్రయాణిస్తోందో అంచనా వేయవచ్చు. అయితే కేవలం శాటిలైట్ ఫోటోలను చూసి భూమిపై ఈదురుగాలుల వేగం ఎంత ఉంటుందో, ఎంత వర్షం కురుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేమని, దానికోసం వాతావరణ శాఖ ఇతర సమాచారాన్ని కూడా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు.