Site icon NTV Telugu

TTE: నకిలీ టీటీఈ అవతారమెత్తిన ఆర్మీ జవాన్.. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ..

Army Jawan

Army Jawan

రైళ్లలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లుగా, టీసీలు(టికెట్ చెక్కర్స్)గా అవతారమెత్తి ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదేవిధంగా ఫేక్ టీటీఈగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. అయితే ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే? ఓ ఆర్మీ జవాన్ నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడడం. రైలులో ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఝాన్సీ నుంచి గ్వాలియర్‌కు ప్రయాణిస్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.

Also Read:Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..

నివేదికల ప్రకారం, సైనికుడు కమల్ పాండే, TTEగా నటిస్తూ, రైలు బోగీలో ప్రయాణికుల నుండి డబ్బు వసూల్ కు పాల్పడ్డాడు. సీట్లు లేని ప్రయాణీకులకు సీట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి వారి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఈ సమయంలో ఆ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాదు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కూడా ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు.

Also Read:PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!

ఫిర్యాదు అందిన వెంటనే, RPF బృందం స్పందించింది. జీలం ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోకి వచ్చి నకిలీ టీటీఈని గుర్తించారు. ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తుండగా వారు కమల్ పాండేను పట్టుకున్నారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో అతన్ని దింపి GRPకి అప్పగించారు. నిందితుడు కమల్ పాండే ఆర్మీలో పనిచేస్తున్నాడని, ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్ పొందాడని జిఆర్‌పి స్టేషన్ ఇన్‌చార్జ్ జితేంద్ర చందేలియా తెలిపారు. అతని వద్ద ప్రయాణికుల నుండి వసూలు చేసిన రూ.1,620 దొరికింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.

Exit mobile version