Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!

Arjun Tendulkar

Arjun Tendulkar

Arjun Tendulkar: ముంబై టీ20 లీగ్‌లో క్రికెట్ దిగ్గజం అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వాంఖడే స్టేడియం వేదికగా బాంద్రా బ్లాస్టర్స్, ARCS అంధేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్‌లో చెలరేగిన అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 13 డాట్ బాల్స్ వేస్తూ బాంద్రా బ్లాస్టర్స్‌పై పై చేయి సాధించాడు. అర్జున్ ధాటికి ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ARCS అంధేరి జట్టుకు ప్రారంభంలోనే తొలి వికెట్ కోల్పోయినా, ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్ క్రీజులోకి వచ్చి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అర్జున్ కేవలం 25 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసి ప్రేక్షకులను అలరించాడు. మొత్తం 34 బంతులు ఎదుర్కొన్న అతను 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సహాయంతో 194.12 స్ట్రైక్‌రేట్‌తో అజేయంగా 66 పరుగులు చేశాడు. ముంబై టీ20 లీగ్‌లో ARCS అంధేరి తరఫున అర్జున్ నమోదు చేసిన తొలి అర్ధశతకం ఇదే కావడం విశేషం.

బంతితో మూడు వికెట్లు, బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ARCS అంధేరి జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అర్జున్ టెండూల్కర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. తండ్రి సచిన్ టెండూల్కర్ వారసుడిగా మాత్రమే కాకుండా, తన సొంత ప్రతిభతోనూ గుర్తింపు తెచ్చుకునే దిశగా అర్జున్ మరో కీలక అడుగు పడింది.