Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్’కు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
సిబ్బందిలో మార్పులు చేర్పులను కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా వెల్లడించిన సమాచారంలో కొత్తతరం స్క్రీన్ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తున్న 87 మందిని, కారు ప్రాజెక్టు నుంచి మిగతావారిని తీసేసినట్లు సమాచారం. 2014లో ఆరంభించిన కార్ ప్రాజెక్ట్‌ను మూసివేస్తున్నట్లు 2024 ఫిబ్రవరిలో యాపిల్ పేర్కొంది. కొన్ని రోజుల తరువాత భారీగా ఉద్యోగులను తొలగించింది.
Also Read: AC Tickets: మండుతున్న ఎండలు.. ట్రైన్, బస్సుల్లో ఏసీ టికెట్లకు భారీ గిరాకీ!
కొత్తతరం టెక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడంలో భాగంగా స్మార్ట్ కారు, డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అయితే భారీ ఖర్చు, పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. డిస్‌ప్లే ప్రాజెక్టులో ఇంజినీరింగ్, సరఫరా వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. స్మార్ట్ కారుపై పనిచేస్తున్న వారిలో కొంతమందిని కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారట. మొత్తంగా కాలిఫోర్నియాలోని 600 మంది ఉద్యోగులకు కంపెనీ పింక్ స్లిప్‌ను జారీ చేసిందట.