Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా తయారవుతున్న ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలు స్వల్పంగా తగ్గాయి.
యాపిల్ తన కొత్త మోడళ్లు లాంచ్ చేసినప్పుడు మాత్రమే.. పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుందన్న విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ 2024లో మొబైల్ ఫోన్‌లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. దాంతో యాపిల్ ధరలను సవరించింది. దేశీయంగా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లకు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జి కలిపి 22 శాతంగా ఉంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. బడ్జెట్ తర్వాత కస్టమ్ డ్యూటీ 15 శాతం, 1.5 శాతం సర్‌ఛార్జి కలిపి 16.5 శాతానికి తగ్గింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
యాపిల్ కంపెనీ ప్రస్తుతం ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 బేసిక్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తోంది. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లను మాత్రం దిగుమతి చేస్తోంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో 3-4 శాతం మేర ధరలు తగ్గాయి. దేశీయంగా తయారైన ఫోన్‌లకు మాత్రం 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో తగ్గింపు స్వల్పంగానే ఉంది. తాజా ధరలను యాపిల్ కంపెనీ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.