OLED డిస్‌ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌, A20 Pro చిప్‌సెట్‌తో Apple iPad mini (2026) విడుదల..!

  • 8.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ఐప్యాడ్ మినీ 2026 విడుదల
  • 2ఎన్ఎం టెక్నాలజీతో తయారైన ఏ20 ప్రో చిప్‌సెట్
  • ఐప్యాడ్‌ఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌..
  • ముందు భాగంలో 12ఎంపీ ల్యాండ్‌స్కేప్ సెంటర్ స్టేజ్ కెమెరా
  • వెనుకవైపు 12ఎంపీ వైడ్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్..
Apple Ipad Mini (2026)

Apple Ipad Mini (2026)

 Apple iPad mini (2026): టెక్ దిగ్గజం సంస్థ యాపిల్ (Apple) నుండి ఐప్యాడ్ మినీ (2026)ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో సోమవారం అధికారికంగా విడుదల చేసింది. తన మొట్టమొదటి టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న ‘ప్రో అండ్ టెల్’ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందే ఈ కాంపాక్ట్ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సరికొత్త 8.5 అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చిన తొలి ఐప్యాడ్ మినీ మోడల్ ఇదే. వీటితోపాటు అత్యంత శక్తివంతమైన A20 Pro చిప్‌సెట్, ల్యాండ్‌స్కేప్ ఫ్రంట్ కెమెరా, ఐప్యాడ్ ఓఎస్ 27, అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఇది రూపొందింది.

డిస్‌ప్లే, అకౌస్టిక్ ఆడియో

ఐప్యాడ్ మినీ (2026)లో 8.5 అంగుళాల సూపర్ రెటినా XDR (2316 x 1512 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను అమర్చారు. ఇది P3 వైడ్ కలర్ గామట్ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆడియో విభాగంలో ఈసారి సరికొత్త ‘అకౌస్టిక్ డిస్‌ప్లే’ సిస్టమ్‌ను పరిచయం చేశారు. టాబ్లెట్ గ్లాస్, అల్యూమినియం బాడీ మధ్య ప్రత్యేకంగా రూపొందించిన వూఫర్లు, కస్టమ్ ట్వీటర్లను అమర్చారు. దీనివల్ల స్క్రీన్ నుంచే నేరుగా సౌండ్ వస్తుంది.

2nm A20 Pro చిప్‌సెట్

ఈ టాబ్లెట్ 2nm ప్రాసెస్‌పై ఆధారపడిన యాపిల్ A20 Pro చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో న్యూరల్ యాక్సిలరేటర్లతో కూడిన 7-కోర్ GPU ఉంది. 128GB, 256GB మోడళ్లలో 5-కోర్ CPU ఉండగా, 512GB వేరియంట్‌లో 6-కోర్ CPU లభిస్తుంది. మునుపటి తరం ఐప్యాడ్ మినీతో పోలిస్తే ఇది 4.5 రెట్లు వేగవంతమైన AI పనితీరును, 2.7 రెట్లు మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును, 60% వరకు వేగవంతమైన మల్టీ-థ్రెడెడ్ CPU పనితీరును అందిస్తుందని యాపిల్ వెల్లడించింది. ఇది సరికొత్త ఐప్యాడ్ ఓఎస్ 27 (iPadOS 27) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అధునాతన సిరి AI తో పాటు నూతన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను పూర్తిగా సపోర్ట్ చేస్తుంది.

కెమెరా & కనెక్టివిటీ ఫీచర్లు

వీడియో కాల్స్ సౌకర్యార్థం ముందు భాగంలో ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ 12 MP సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు. వెనుకవైపు స్మార్ట్ HDR 4 సపోర్ట్, 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన 12 MP వైడ్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ పరంగా ఇందులో యాపిల్ N1 వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ చిప్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 ఉన్నాయి. సెల్యులార్ మోడళ్లలో C2 మోడెమ్‌ను అమర్చారు. ఇది మునుపటి కంటే 50% వేగవంతమైన డేటా స్పీడ్‌ను ఇవ్వడంతో పాటు eSIM సదుపాయాన్ని అందిస్తుంది.

ధర

భారత మార్కెట్లో ఐప్యాడ్ మినీ (2026) మిడ్‌నైట్, స్టార్‌లైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. Wi-Fi వేరియంట్ (128GB) ప్రారంభ ధర రూ. 82,900 కాగా, Wi-Fi + Cellular వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,00,900 నుండి మొదలు కానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘ఎడ్యుకేషన్ సేవింగ్స్’ కింద దీన్ని రూ. 76,900 ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇది 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అక్టోబర్ 28 నుంచి యాపిల్ ఇండియా వెబ్‌సైట్, యాపిల్ స్టోర్ యాప్ ద్వారా ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. నవంబర్ 6 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లు, అధీకృత రిటైలర్ల వద్ద విక్రయాలు మొదలవుతాయి.

అలాగే, ఈ టాబ్లెట్ కోసం రూ. 8,500 ధరకు కొత్త స్మార్ట్ ఫోలియో (నేవీ బ్లూ, టౌప్ రంగుల్లో)ను కంపెనీ విడుదల చేసింది. అంతేకాకుండా ఇది రూ. 11,900 ధర కలిగిన ‘Apple Pencil Pro’, రూ. 7,900 ధర కలిగిన ‘Apple Pencil (USB-C)’ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.