AP Voter List Revision 2026 Begins: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 14 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్తారు. రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావడంతో పాటు తప్పులు సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా అనర్హులైన వారి పేర్లను తొలగించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ.. ఏన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని బీఎల్‌వోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎవరైనా ఓటరు ఇంట్లో లేకపోయినా, వారి వివరాలు నమోదు కావడానికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
అలాగే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని కూడా ఎన్నికల సంఘం కోరింది. బీఎల్‌వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించింది. దీనివల్ల ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఓటర్ల జాబితాలో తమ పార్టీ అనుకూల ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, కొత్త అర్హుల పేర్లు నమోదు అయ్యేలా క్రింది స్థాయి నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని తమ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో ధృవీకరించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. సర్ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫాంలు ముద్రించింది. 46,397 మంది బీఎల్‌వోలు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి ఈసీ ఇప్పటికే శిక్షణిచ్చింది. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని.. ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,68,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మందికి మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యుమరేషన్ ఫాం, 2002 నాటి జాబితాలో వారి/కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇవ్వాలి.

