NTV Telugu Site icon

Atchannaidu: ఓటర్ లిస్ట్ కన్నా.. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువ..!

Atchannaidu

Atchannaidu

Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉంది అంటూ ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వ వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు, ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు ? అంటూ ఫైర్‌ అయ్యారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అని మండిపడ్డారు.

Read Also: Mangalavaaram : భారీ మొత్తానికి మంగళవారం మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?

చంద్రబాబు కోసం ఆత్మాహుతికి పాల్పడే నాయకులు, కార్యకర్తలు టీడీపీ సొంతం అన్నారు అచ్చెన్నాయుడు.. అలాంటి వారు అక్రమ హత్యాయత్నం కేసులకు భయపడతారా జగన్ రెడ్డి..? అంటూ సీఎంను హెచ్చరించారు. మీకు ఇంకా 5 నెలలే ఉంది ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రం నుంచి తన్ని తరుముతారు అని వార్నింగ్‌ ఇచ్చారు అచ్చెన్నాయుడు.. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టడం.. ఆయన్ను అరెస్ట్‌చేసి రాజమండ్రి జైలులో పెట్టిన తర్వాత.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.. అయినా, అధికార పక్షం.. స్కామ్‌లు జరిగాయంటూ పలు కేసులు పెడుతూ వస్తూనే ఉంది.