AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ!

Rythu Sukhibhava And Ntr Bharosa Pensions

Rythu Sukhibhava And Ntr Bharosa Pensions

Rythu Sukhibhava and NTR Bharosa Pensions Today: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతులు, పెన్షన్‌దారులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకం రెండో విడత నిధులను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.3,125 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. మరోవైపు నవంబర్‌ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అర్హులైన పెన్షన్‌దారులకు అధికారులు నేడు నగదు అందించనున్నారు.

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకం రెండో విడత నిధులు నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా.. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. ఈ నిధులతో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ పనులకు అవసరమైన ఖర్చుల కోసం ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కూడా నేడు చేపట్టనున్నారు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తుండగా.. ఈసారి నవంబర్‌ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. నవంబర్‌ 1న అందించాల్సిన పెన్షన్లను అక్టోబర్‌ 30నే లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ సిబ్బంది నిమగ్నం కానున్న నేపథ్యంలో పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పెన్షన్‌దారులకు నేడు నగదు పంపిణీ చేయనున్నారు. నేడు వివిధ కారణాలతో పెన్షన్లు తీసుకోలేకపోయిన లబ్ధిదారులకు నవంబర్‌ 4, 5 తేదీల్లో పంపిణీ చేయనున్నారు. డిసెంబర్‌ నెల నుంచి మాత్రం పెన్షన్ల పంపిణీ యథావిధిగా ప్రతి నెల ఒకటో తేదీనే కొనసాగనుంది.