NTV Telugu Site icon

Gudivada Amarnath: విశాఖలో ఎకరంతో తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు.. హైదరాబాద్‌ దాటితే ఏముంది..?

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నేతల మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది.. తాజాగా ఇప్పుడు భూముల రేట్లు కూడా ఇరు రాష్ట్రాల మధ్య విమర్శలు, కౌంటర్లకు దారి తీస్తోంది.. అయితే, ఈ భూముల విషయాన్ని ముందు ప్రస్తావించింది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే.. తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు.. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు, వందెకరాలు కూడా కొనే పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు చంద్రబాబు.. అయితే, పటాన్‌చెరులో ప్రస్తుతం ఉన్న భూమి ధరను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు సీఎం కేసీఆర్..

Read Also: Train Accident: లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కోచ్ లో భారీ మంటలు.. భయంతో పరుగుతీసిన ప్రయాణికులు

పటాన్‌చెరులో ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతోంది.. చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చు. ఇంకా, నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్‌.. గతంలో ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనవచ్చునని చంద్రబాబు చెప్పేవారని, ఇప్పుడు భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందన్న కేసీఆర్.. తెలంగాణలో గత కొన్నేళ్లలో భూముల ధరలు భారీగా పెరిగాయని, ఏపీలో తగ్గాయన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారని, మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్నారు. అయితే, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు.. భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్న ఆయన.. మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు.. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.