AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్‌ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్‌కు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. మరికాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, లిక్కర్ రవాణా ఒప్పందాల వ్యవహారంలో సుమారు రూ.195.33 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. టెండర్ల కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. జిల్లా స్థాయిలో ఒక్కో కార్టన్‌కు సగటున రూ.19.68గా ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, వారి అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నిర్వహించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో అప్పటి ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. చట్టబద్ధంగా అమల్లో ఉన్న జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. కారుమూరి సునీల్ అరెస్ట్‌తో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

