ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయనున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Also Read: Crime News Today: జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!
విజయవాడ సబ్ జైలు దగ్గర మరోసారి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా చేశారు. జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ‘తప్పుడు కేసులు పెట్టీ నన్ను అన్యాయంగా జైలుకి పంపారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది’ అని చెవిరెడ్డి అన్నారు. ఇటీవల సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జులై 1 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియనుండటంతో పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అంగీకరించింది.