Site icon NTV Telugu

AP High Court: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?

Ap High Court

Ap High Court

AP High Court: అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి, ఎలా చేయాలి అన్న అవగాహన వారికి ఎలా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. చాలామంది చిరు వ్యాపారులు చదువు రాని వారే ఉంటారని, అలాంటి వారు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారని కోర్టు ప్రశ్నలు సంధించింది.

Read Also: AP Liquor Scam Case: చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి

సాంప్రదాయ బహిరంగ వేలం విధానమే చిరు వ్యాపారులకు అనుకూలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీ రూముల్లో కూర్చుని తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యలను గమనించకుండా యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దుకాణాల కేటాయింపుకు సంబంధించి జారీ చేసిన ఈ-వేలం నోటిఫికేషన్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version